Tuesday 1 October 2013

కామెర్లు- జాండిస్- హెపటైటిస్

కామెర్లు/ జాండిస్ అని పిలిచే ఈ సమస్యని ఆయుర్వేదంలో 'కామల'గా గుర్తిస్తారు.  వ్యాధి తీవ్రతను బట్టి ఆయుర్వేదంలో దీన్ని మూడు రకాలుగా చూస్తారు: సాధారణ కామల, కుంభ కామల, హలీమకం. వీటిలో మొదటిదాన్ని సులభ సాధ్యంగాను, మూడవదాన్ని కష్టసాధ్యంగాను పరిగణిస్తారు.

కామలలన్నీ కాలేయం సరిగా పనిచేయకపోవటంతో ఏర్పడతాయి. 


సాధారణ కామల ప్రారంభంలో  'కోష్ఠాశ్రితం' - అంటే కాలేయానికి పరిమితమై ఉండి, అటుపైన 'శాఖాగతం'- అంటే ఇతర భాగాలలోకి వ్యాపించింది- అవుతుంటుంది.  'పచ్చ కామెర్లు' అనేది కామల యొక్క శాఖాగత రూపం. అంటే 'శరీర భాగాలు పచ్చగా మారినాయంటే దాని అర్థం ఆసరికి కామల శరీరం అంతా విస్తరించింది' అని. ఇలా అయ్యేముందుగా కామలను గుర్తించటం సాధ్యమే. దానికి కామల 'పూర్వరూపాలు'- అంటే వ్యాధి విస్తరించటానికి ముందు ఉండే లక్షణాలు- ఎలా ఉంటాయో తెలుసుకోవాలి.

కామల-పూర్వరూపాలు:
*ఆకలి తగ్గిపోవటం
*తిన్నది అరగక, వాంతులు కావటం
*కడుపునొప్పి
*కళ్ళు తిరగటం, కళ్ళు చీకట్లు క్రమ్మటం
*మూత్రం పసుపు వర్ణంలో ఉండటం
*మలం తెల్లగా కాని, నల్లగా కానీ ఉండటం.

కామల శాఖాగతం అయినకొద్దీ కళ్ళు, గోర్లు, చివరికి చర్మం మొత్తం పసుపురంగు తిరుగుతుంది. 

నీటి కాలుష్యం వల్ల కాలేయం బలహీనపడి, జీర్ణక్రియ మందగిస్తుంది. కాలేయం సరిగా పనిచేయనప్పుడు అరుగుదల అస్సలు సరిగా ఉండదు.  అలాంటప్పుడు తిన్నది అరుగుతున్నదీ లేనిదీ గమనించకుండా వివిధ ఆహార పదార్థాలను, వాళ్ళు చెప్పారనీ వీళ్ళు చెప్పారనీ- సేవించటం ప్రమాదానికే దారి తీస్తుందని గ్రహించాలి.  ప్రధానంగా బయటి- (హోటళ్లలో దొరికే) పదార్ధాలు- నూనె పదార్థాలు, చిరుతిళ్ళు, కూల్‌డ్రింకులు, పిండివంటలు కాలేయాన్ని గందరగోళపరుస్తాయి; కామలను వృద్ధి చేయటం మాత్రమే కాదు, అసలు కామలకు ప్రధాన కారణాలు కూడా ఇవే అని గమనించుకోవాలి. 

కాలేయపు పని తీరును తెలిపే మౌలిక పరీక్ష 'బిలురుబిన్' టెస్టు.   రక్తంలో 'బిలురుబిన్' పరిమాణం ఒకటి కంటే ఎంత ఎక్కువ ఉంటే కాలేయం అంత అధ్వాన్నంగా ఉందని తెలుస్తుంది.  ఇది కాక సమస్య తీవ్రతను, రకాన్ని గుర్తించటంకోసం వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తుంటారు.   

కామలలో ఉపయోగపడే మొక్కలు:
1.  నేల ఉసిరి:  ఒకటి- ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ మొక్కకు చింతాకును పోలిన చిన్నచిన్న ఆకులుంటాయి.  రెమ్మల పొడవునా, వాటి వెనుకవైపున-  ఆవగింజలంత సైజులో చిన్న చిన్న కాయలుండటం ఈ మొక్క ప్రత్యేకత.  దీని ఆధారంగా మొక్కను గుర్తించటం సులభం. ఈ మొక్క మొత్తం- వ్రేళ్లతో సహా- మందుగా పనికి వస్తుంది.

(Picture)

2. తిప్ప తీగ: గుండె ఆకారపు ఆకులుండే తీగ ఇది. చెట్లు బాగా పెరిగే ప్రాంతాలలో వృక్షాలకు అల్లుకొని విస్తారంగా పెరిగే ఈ తీగనుండి సన్నటి తీగల్లాంటి ఊడలు బయలుదేరి, నేలను చేరుకోవటం ప్రత్యేకత.  వీటి పళ్ళు చిన్నగా, ఎర్రటి గుత్తులుగా ఆకర్షణీయంగా ఉంటాయి.  ఈ తీగ (ముదురు) కాండంలో వైద్యపరమైన గుణాలున్నాయి.

(Picture)


ఈ మొక్కల్ని బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసి,  గుప్పెడు ముక్కల్ని గ్లాసునీటిలో వేసి, సన్నటి సెగమీద చాలాసేపు మరగబెట్టాలి. ఆ నీరు పావు వంతుకు ఇగిరిపోయాక, వడకట్టి ఆ కషాయాన్ని ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపున సేవిస్తే గుణం ఉంటుంది.


కుంభకామలలో కాలేయపు వాపు ప్రధానంగా కనబడుతుంది. అల్లోపతీవారు దానిని 'హెపటైటిస్' గా వ్యవహరిస్తారు.  హలీమకం కాని సమయాల్లో  దీన్ని ఆయుర్వేద మందులద్వారా సులభంగానే సరి చేసుకోవచ్చు.

కామలలో ఆహారనియమాలను గట్టిగా పాటించటం అవసరం. అరుగుదల సరిగా ఉండదు కనుక, సరిపడని ఆహారం విష సమానం అయి, రోగి పరిస్థితి విషమించటం అనేక సందర్భాలలో కనిపిస్తుంది.  అందువల్లనే కామలలో డాక్టర్ల పర్యవేక్షణ అవసరం అని చెబుతాం.

ఆహారంలో పనికిరానివి:

ఉప్పు : అస్సలు పనికిరాదు. బిలురుబిన్ స్థాయి ఒకటి వచ్చేవరకు- అది నెలైనా, రెండు నెలలైనా, మూడు నెలలైనా- ఆరు నెలలైనా సరే, ఉప్పులేని ఆహారాన్నే సేవించాల్సి ఉంటుంది.
* నూనె : అస్సలు పనికిరాదు. వివిధ సందర్భాలలో నూనెను తలకు పెట్టుకోవటం కూడా‌ నిషేధిస్తారు.  తిరగమాత పెట్టిన కూరలు కూడా పనికిరావు. చాలా సార్లు (-తిరగమాత వాసన రోగులకు వాంతి తెప్పిస్తుంది-) ఇంట్లో తిరగమాత పెట్టటాన్నే నిషేధిస్తారు.
* పసుపు : అస్సలు పనికిరాదు.  కామల శాఖాగతం కాకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి.

ఆహారంలో పనికొచ్చేవి- సరైన ఆహారం :

* ఉప్పులేని రొట్టె
* బియ్యపు రవ్వ గంజి
* అరిగే సందర్భం వచ్చినప్పుడు, వైద్యం కారణంగా ఆకలి బాగా పెరిగినప్పుడు- వైద్యుల పర్యవేక్షణలో- కొద్ది కొద్దిగా పాలన్నం, పులగం.
* కాచి చల్లార్చి వడకట్టిన నీళ్ళు.

కాలేయం ఏ కొంచెం పాడయినాసరే, దాన్ని బాగు చేసేందుకు అల్లోపతీలో ఎలాంటి మందులూ లేవు.  పైపెచ్చు ప్రతి అల్లోపతీ మందూ పనిచేసేందుకు కాలేయపు స్రావాలమీద ఆధారపడుతుంది. ఆసరికే సరిగా పనిచేయని కాలేయంమీద ఈ మందులు ఒత్తిడిని మరింత పెంచి, అలా దాన్ని ఇంకొంత పాడు చేస్తాయి.  ముఖ్యంగా జ్వరం తగ్గించేందుకు వాడే 'పారాసెటామాల్' మందు, సూక్ష్మ జీవులను చంపేందుకు వాడే 'ఆంటీ బయటిక్' మందులు కాలేయం మీద విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి. వీటి వాడకం వల్ల కామల ఏర్పడే సందర్భాలు కూడా కొల్లలు.  గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్లు చేసిన సందర్భాలలోను, ఇతరత్రా సమస్యలున్నపుడూ ఇచ్చిన యాంటీబయటిక్ మందులు, అప్పుడే పుట్టిన శిశువుల్లో కలుగుతున్న కామలకు ఆధారం అవుతాయి.

కామెర్లను ఆయుర్వేదంద్వారా దాదాపు నూటికి నూరుశాతం నయం చేసుకోవచ్చు: రోగం విషమించకుండానే కనుగొనాలి; రోగి ఆహారనియమాలను పాటించటంలో నిష్ఠగా ఉండాలి. 

నీరసం, రక్తహీనత, వాంతులవ్వటం-  వీటిని నివారిస్తూ, కామలను తగ్గించే మందులు ఆయుర్వేదంలో చాలానే ఉన్నాయి.  వ్యాధి తీవ్రతను బట్టి, వైద్యులు పై కషాయాలకు మరికొన్ని మాత్రలనూ తమ తమ యుక్తిని బట్టి జోడిస్తుంటారు.
సరిగా పట్టించుకోకపోతే కామల ప్రాణాంతకం కావచ్చు.  అందువల్ల కామల వ్యాధిలో సరైన ఆయుర్వేద వైద్యులను సంప్రతించండి- సొంత వైద్యం వద్దు.

1 comment:

  1. ‘very good website’
    ayurbless team
    visit my ayurveda free treatment website: http://ayurbless.blogspot.in

    ReplyDelete