Saturday 28 September 2013

మూత్రాఘాతం, మూత్ర కృచ్ఛం, అశ్మరి

ఇవి మూడూ మూత్ర సంబంధ సమస్యలు.  మూత్రం ఆగి ఆగి రావటం, మూత్రంలో మంట, మూత్రాశయంలోనూ, మూత్ర పిండాలలోనూ రాళ్ళు ఏర్పడటం అన్న మూడింటినీ ఆయుర్వేద వైద్య పరిభాషలో పై విధంగా పిలుస్తారు.  ఈ సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదంలో చక్కని ఉపాయాలు ఉన్నాయి.

పై మూడింటిలో మొదటి రెండూ చిన్న సమస్యలు: ఇతర కారణాలేవీ లేకుంటే చాలా సులభంగా నాలుగైదు రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించుకోవచ్చు. మూడవదైన అశ్మరిని మటుకు అంత చిన్న సమస్యగా భావించకూడదు.  దాని పరిష్కారానికి సమయం పట్టటమే కాదు; ఆ సమస్య ఉన్న రోగులు ఆహార పరమైన నియమాలను కూడా మరింత ఖచ్చితత్వంతో పాటించవలసి ఉంటుంది.

ఈ మూడు సమస్యలకూ ఆయుర్వేదంలో అనేక ఔషధాలను, మూలికలను సూచించారు మన ఋషులు.  వీటి పరిష్కారంలో చాలాబాగా పనిచేసే ఔషధాలు ప్రధానంగా మూడు:

1. పల్లేరు కాయలు
2. కొండపిండి ఆకు
3. గలిజేరు (గంజరాకు మొక్క)

పల్లేరు మొక్కలు పొలాల్లోను, రోడ్ల ప్రక్కనా, చేలల్లోను, ఖాళీ స్థలాలలోను ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటాయి.  వానా కాలంలో నేలమీద పచ్చగా పరచుకుంటూ పసుపుపచ్చరంగు పూలతో ఆకర్షణీయంగా కనబడే ఈ మొక్కలకు ముళ్ళతో కూడుకున్న కాయలుంటాయి.  బాటసారుల చెప్పులకు గుచ్చుకొని బాధపెట్టే ఈ మొక్కల్ని అందరూ ద్వేషించుకుంటూ ఉంటారు- దీని ఉపయోగం తెలీక. ఇది మూత్ర సమస్యల్ని మటుమాయం చేసే మూడు మొక్కల్లో మొదటిది. దీని కాయలు (ముళ్ళతో కూడుకున్న భాగం) పచ్చివైనా, ఎండిపోయినవైనా సరే, వైద్యానికి పనికొస్తాయి.
పల్లేరులో రెండురకాలున్నాయి. ఒకరకం పైన చెప్పినట్లు నేలబారుగా పరచుకుంటే, మరొక రకం- 'ఏనుగు పల్లేరు ' మూడు నాలుగడుగుల చెట్లుగా పెరుగుతుంది.  రెండింటి కాయలూ వైద్యానికి ఉపయోగ పడతాయి. మూత్ర సమస్యల పరిష్కారంలో రెండూ  ప్రభావశీలమైనవే. శాస్త్ర ప్రకారం ఏనుగుపల్లేరు ఉత్తమమైనది- అయినా ప్రజల్లో దానిపట్ల చులకన భావమూ, అనవసర భయాలూ ఉన్నట్లు తోస్తుంది.

(Picture)

కొండపిండి మొక్కలు రెండడుగుల ఎత్తు వరకూ పెరుగుతూ తెల్లటి నూగుతో ఉండే మొక్కలు.  ఒక సమయంలో వీటి పచ్చటి ఆకులన్నీ రాలిపోయి, కేవలం పొడిపొడిలాంటి నూగుతో కూడిన పూత చెట్టునిండుగా కనబడుతుంటుంది.  కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సమయంలో గొబ్బెమ్మల్ని అలంకరించేందుకు ఈ పూతని ఉపయోగిస్తుంటారు.  సంస్కృతంలో 'పాషాణ భేది ' అని పిలువబడే ఈ మొక్క నిజంగానే రాళ్లను పగలగొడుతుంది: మూత్రపిండాలలో పెరిగే రాళ్లను ముక్కలు ముక్కలుగా చేయటంలో దీన్ని మించిన ఔషధం లేదు అని చెబుతారు.

(picture)

నీటి లభ్యత ఉండే చోట్ల- తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో- నేలబారున పెరిగే మొక్క, గలిజేరు.  కొన్ని ప్రాంతాల్లో ఇది గంజరాకుగా ప్రసిద్ఢం.  దీన్ని పల్లెల్లో 'తినే ఆకు 'గా గుర్తిస్తూ పప్పులో వేసుకుంటారు, వేపుడుగా కూడ చేసుకుంటారు.  దీని చిన్న చిన్న ఆకులు చిత్రంగా వంకరలు తిరిగి ఉంటాయి. ముదిరిన ఆకుల అంచుల పొడవునా వంకాయరంగు చార ఉండటంకూడా దీన్ని గుర్తించేందుకు సాయపడుతుంది: (అయితే ఈ చార ఉండని రకం కూడా ఒకటున్నది) గలిజేరులో ప్రధానంగా  రెండురకాలు ఎరుకలో ఉన్నై: తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. మూత్ర సమస్యల పరిష్కారంలో రెండురకాలూ చక్కగా పనిచేస్తాయి. వీటిని వ్రేళ్ళతో సహా వాడుకొనవలసి ఉంటుంది.

**ఉపయోగించే పద్ధతి**

మూత్ర సమస్యలు ఉన్నవాళ్ళు
1. చారెడు పల్లేరు కాయలు(ముళ్ళు),
2. చిన్న చిన్న ముక్కలుగా చేసిన కొండపిండి చెట్ట్లు (పూతతో సహా) ఒక గుప్పెడు,
3. గలిజేరు చెట్లు (చిన్న చిన్న ముక్కలుగా కోసినవి, వ్రేళ్లతో సహా)ఒక గుప్పెడు-


మూడింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి ఒక పెద్ద గ్లాసెడు నీళ్ళు పోసి సన్న మంటమీద మరిగించాలి.  ఆ గ్లాసెడు నీళ్ళూ పావు గ్లాసెడు అయ్యేంతవరకూ మరిగేసరికి, ఔషధాల్లోని సారం పూర్తిగా నీళ్లలోకి చేరుకుంటుంది.  ఇలా తయారైన ద్రవాన్ని 'కషాయం' అంటారు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని ఖాళీకడుపున త్రాగటం అవసరం.

సమస్య తీవ్రతనుబట్టి- ముఖ్యంగా అశ్మరిలో- పల్లేరు ముళ్ళు కొన్ని  (ఒక గుప్పెడు) వేసి, మరిగించి చల్లార్చిన నీళ్ళను రోజంతా, ఎప్పుడు దాహం అయితే అప్పుడు త్రాగేందుకు వాడుకోవలసి వస్తుంది.

అశ్మరిలో నడుము నొప్పి అధికంగా ఉన్నట్లయితే తైలం (నువ్వులనూనె)గాని, వైద్యులు సూచించే ఇతర ప్రత్యేకమైన ఔషధ తైలాలుగాని పొత్తి కడుపు/నడుముకు రాసుకొని, ఒక గంట తర్వాత స్నానం చేయటం ఉపశమనాన్నిస్తుంది.

సమస్య మరీ అధికంగా ఉన్న సందర్భాలలో వైద్యులు ఔషధ తైలాలను నడుముకు, పొత్తికడుపుకూ పట్టించి ప్రత్యేకమైన ఆకులతో కట్టిన మూటలతో కాపడం పెట్టిస్తారు.  వీటికి అదనంగా వైద్యులు వారి వారి యుక్తిననుసరించి పలురకాల మాత్రలనూ  సూచిస్తారు.

**ఆహారంలో తీసుకోకూడనివి:**

*పెరుగు
*టమాట
*క్యాబేజీ
*పాలు, పాల పదార్థాలు
*మసాలా, కారం అధికంగా ఉండే పదార్థాలు
*నూనె/పిండి వంటలు

**ఆహారంలో అధికంగా తీసుకోవలసినవి:**

*చిలికి వెన్న తీసిన మజ్జిగ
*ఎక్కువమొత్తంలో నీళ్ళు
*జొన్నలు
*పెసలు
*బార్లీ
*రాగులు
*గలిజేరు
*కొండ పిండి ఆకు


2 comments:

  1. బాగుంది. చక్కని సమాచారం ఇచ్చారు. చిత్రాలు కూడా త్వరలో పెడతారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. మద్య పానం చేసే వారిని దాని నుండి విముక్తుల్ని చే సే ప్రయో గాలు చెప్పండి.ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి.ఉన్న మందు ల్నే చెప్పి ప్రయోజనం ఏమిటి మద్యెం మహా మారినుండి రక్షించండి.

    ReplyDelete